అమ్మవారి కటాక్షం కోసం...
దసరా ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. నైవేద్యాలకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇళ్లలో అమ్మవారిని ప్రతిష్టించుకుని పూజలు చేసుకునే వారు తమ శక్తి కొలది ప్రసాదాలు సిద్ధం చేస్తారు. కానీ ఏ రోజు ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనేది మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. శాస్త్రోక్తంగా అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాలు పెడితే అమ్మవారి కృపాకటాక్షాలు సిద్ధిస్తాయో స్వయంగా ప్రసాదాలు సిద్ధం చేసి మరీ వివరిస్తున్నారు దుర్గ గుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ సతీమణి విష్ణుభట్ల పద్మావతి.
ఈ ఏడాది దసరా ఉత్సవాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్యీయుజ శుద్ధ దశమి వరకు జరగునున్నాయి. పది రోజులు అమ్మవారికి ఒకో రోజు ఒకో ప్రసాదం నివేదించాలి.
- తొలి రోజు అమ్మవారికి పాలు, అన్నం కలగలిపిన పదార్థాన్ని నివేదించాలి.
- రెండో రోజు అమ్మవారికి పెరుగన్నం, పప్పుదినులతో నైవేద్యాన్ని నివేదించాలి.
- మూడో రోజు అమ్మవారికి బియ్యం, బెల్లం, నెయ్యి కలిపి సిద్ధం చేసిన అప్పాలను నివేదించాలి.
- నాలుగోరోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పులిహోర నివేదించాలి.
- ఐదో రోజు అమ్మవారికి చెక్కరపొంగలి సమర్పించాలి.
- ఆరో రోజున శాకాన్నాన్ని నివేదించాలి. అంటే వివిధ రకాల కూరగాయలు, ఆరు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసే అన్నప్రసాదాన్ని అమ్మవారికి ఆ రోజు నివేదించాలి.
- ఏడో రోజు శనివారం అమ్మవారికి కొబ్బరితో సిద్ధం చేసిన ప్రసాదాన్ని అంటే కొబ్బరి అన్నాన్ని నివేదించాలి.
- దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రియమైన మినుములతో తయారు చేసిన చిట్టిగారెలు సమర్పించాలి.
- నవమి రోజు అమ్మవారికి నువ్వులతో సిద్ధం చేసిన నైవేద్యాన్ని నివేదించాలి.
- ఇక చివరగా దశమి రోజున అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, చింతపండు పులుసుతో కలిపి సిద్ధం చేసే కదంబ ప్రసాదాన్ని నివేదించాలి.