ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా కృష్ణా జిల్లా నూజివీడులో దసరా ఉత్సవాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం... ఆలయాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి దేవాలయంలో అంతరాలయ ప్రవేశాలను రద్దు చేశారు.
నూజివీడు పట్టణంలో ఉన్న శ్రీ కోట మహిషామర్ధిని అమ్మవారి దేవాలయం, కంచి కామాక్షి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలను సంప్రదాయకంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రజిత కవచఅలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవాలయాన్ని మామిడి తోరణాలు, పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిచారు.