విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శవన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 17న నవరాత్రులు ప్రారంభమైన నాటి నుంచి అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
అమ్మవారి నిత్య పూజలు ,ఊరెేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళ తాళాలతో అమ్మవారు ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. మంగళ వాయిద్యాలు మాత్రమే ఉంటుండగా.. ఈసారి కేరళ సాంప్రదాయ వాద్యమైన సింగరి మేళాన్ని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.. ఈసారి ఉత్సవాల్లో కేరళ సాంప్రదాయ సింగరి మేళతాళాల ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజూ మంగళ వాయిద్యాలతో పాటు సింగిరి మేళం ధ్వనులతో ఆలయం పరిసర ప్రాంతాలు మారు మోగుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కేరళ సాంప్రదాయ ప్రత్యేకతలు..
కేరళ సాంప్రదాయ వాద్యం ప్రదర్శనలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 12 మంది వాద్యకారులతో కూడిన బృందం మూడు వరుసల్లో నిల్చొని లయబద్దంగా వాయిస్తారు. వాయిద్యా కారులు పంచె కట్టులో మాత్రమే కనిపిస్తారు. మధ్యలో పలు రకాల నృత్యం, అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. దుర్గ గుడి రాజగోపురం ముందు వీరు చేస్తోన్న ప్రదర్శనను దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులు కాసేపు నిలబడి తిలకిస్తున్నారు. వీటిని తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు.