Dangerous road between Kankipadu-Gudiwada: కృష్ణా జిల్లాలో రహదారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు సైతం నరకానికి నకళ్లుగా మారాయి. కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కడ చూసినా రోడ్డుపై గుంతలే దర్శనమిస్తున్నాయి. 25 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారి మొత్తం సింగిల్ రోడ్డే ఉంది. బస్సు, లారీ వంటి పెద్ద వాహనాలు ఓ వైపు నుంచి వెళ్తుంటే, మరోవైపు ఇంకో వాహనం వెళ్లే పరిస్థితి లేదు. నిత్యం ఈ రహదారి మీదుగా వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి పక్కనే కాలువ పారుతూ ఉంటుంది. ఒక్కోసారి అదుపుతప్పి వాహనాలు కాలువలో పడుతుంటాయి. కార్లు, బస్సులు వేగంగా వెళ్తుండటం వల్ల, నియంత్రణ తప్పి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ద్విచక్రవాహనదారులకు ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. రహదారి మధ్యలో గోతులు ఏర్పడటంతోపాటు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఒకవైపు పల్లం, మరోవైపు ఎత్తుగా ఉండటం వల్ల వాహనాలు నడపటం ఓ ప్రహసనంలా మారిందని,వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారి పామర్రు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం గుడివాడ నుంచి పెదపారుపూడి వరకు ఉన్న 8 కిలోమీటర్ల మేర సైడ్ రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాల్ నిర్మాణం తర్వాత, రోడ్డు వెడల్పు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు గుడివాడ నుంచి ఉయ్యూరు వరకు ఉన్న రహదారిని రింగ్ రోడ్డుకు కలపాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. జాతీయ రహదారి ప్రతినిధులూ పరిశీలించారు. అయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. త్వరగా స్పందించి కొత్త రోడ్డు వేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.