మున్నేరు వరద తీవ్రతకు లింగాల వంతెన ధ్వంసం. తెలంగాణ ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు భారీ వరద పోటెత్తడంతో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద ఉన్న వంతెన వరద తాకిడికి ధ్వంసమైంది. 800 మీటర్ల పొడవైన వంతెనలో సుమారు 20 మీటర్ల మేర కాంక్రీట్ పలకలు కొట్టుకుపోయాయి. వంతెనపై గుంతలు ఏర్పడినందున రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
మున్నేరుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 1.20 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే వంతెన పైభాగంలోని కాంక్రీట్ పలకలు కొట్టుకుపోయాయని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలకులు ఈ వంతెన నిర్మాణం చేయగా ఆ తర్వాత అనేకమార్లు మరమ్మతులు చేశారు. అందులో భాగంగా వంతెన పైన రెండుసార్లు కాంక్రీట్ పలకలు నిర్మించారు.
ఈ వంతెన తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాలోని పశ్చిమ కృష్ణాకు ప్రధాన రవాణా మార్గంగా ఉంది. జగ్గయ్యపేట ప్రాంతంలోని సిమెంటు పరిశ్రమలకు తెలంగాణ నుంచి రోడ్డు మార్గం పెద్ద ఎత్తున బొగ్గు సరఫరా అవుతుంది. జగ్గయ్యపేట వైపు నుంచి ఆ రాష్ట్రాలకు సిమెంటు ఎగుమతి చేస్తున్నారు. ఈ వంతెనపై 50 టన్నుల సామర్ధ్యం ఉన్న భారీ వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి.
ఏడాది నుంచే వంతెనకు గుంతలు పడ్డాయి. వంతెన కింద చెత్త, ఇసుక మేట వేసి వరదలు వచ్చినప్పుడు కింద నుంచి వెళ్లాల్సిన నీరు పైనుంచి వెళ్తోంది. దీని వల్లే కాంక్రీట్ పలకలు పాడవుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టాక అధికారులు వంతెనపరిశీలించారు. వర్షాలు తగ్గాక మరమ్మతులు చేపడతామని చెబుతున్నారు.
ఇదీ చూడండి.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా