Dalit Bahujan Labour Union: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో దళిత, ఆదివాసీలకు మొండి చేయి చూపారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ... వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాల్సి ఉన్నా.. ఆ మేరకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. కేటాయించిన నామమాత్రపు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో కూడా అత్యధికంగా సాధారణ పథకాలకు 11వేల పైచిలుకు కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు.
ప్రత్యేక నిధులు, పథకాలేవీ... ఐసీడీఎస్, ఉపాధి హామీ, పెన్షన్, పెళ్లి కానుక, సమగ్ర శిక్షా అభియాన్ వంటి సాధారణ పథకాలతో పాటు నవరత్నాలకు ఎస్సీ ఎస్టీ కంపోనెంట్ నిధులను మళ్లించారు తప్ప.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు, పథకాలు బడ్జెట్లో ప్రవేశ పెట్టకపోవడం విచారకరమన్నారు. అత్యాచారాల నిరోధక చట్టం సమర్థవంతమైన అమలుకు తగిన నిధులను కేటాయించలేదన్నారు. సబ్ ప్లాన్ అమలు కోసం ఉన్న నోడల్ ఏజెన్సీకి బడ్జెట్లో ఈసారి కేటాయింపులు తగ్గించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు.