ఆన్లైన్ మోసం... రోజూ పోలీసులు హెచ్చరించే మాటే. అయినా ఓ వ్యక్తి 12 లక్షల రుణం అనగానే నమ్మి మోసపోయాడు. మోసగాళ్లు రుణం ఇవ్వలేదు సరికదా... బాధితుడి నుంచే విడతలవారీగా నగదు వసూలు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన మహేశ్ తాపీమేస్త్రీ. గతేడాది నవంబర్‌లో అతడి చరవాణికి ఓ సందేశం వచ్చింది. మీకు లోన్ కావాలంటే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయండి అనేది అందులోని సారాంశం. మహేశ్ వెంటనే సదరు నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఆధార్, చిరునామా తదితర వివరాలు అడగ్గానే చెప్పేశాడు.
కాసేపటికే.. మహేశ్‌కు నిందితుడు ఫోన్ చేసి రూ.12 లక్షల రుణం మంజూరైందని తెలిపాడు. ఆన్లైన్లో స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ కాపీ పంపారు. ఈ క్రమంలోనే మహేశ్‌ను మాయమాటలతో బుట్టలో పడేశారు. రిజిస్ట్రేషన్, ఇన్‌కంటాక్స్ పేర్లతో విడతల వారీగా 27 వేల రూపాయలను దోచేశారు.