తెలంగాణలో సైబర్ నేరాలు ఆగడం లేదు... రోజూ పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. బాధితుల్లో ఎక్కువగా చదువుకున్నవారే ఉంటున్నారు. తాజాగా నకిలీ మెయిల్ పంపి ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. యాభై వేలు కాజేశారు. ఓ వ్యక్తి పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన నేరగాళ్లు డబ్బులు అత్యవసరంగా కావాలంటూ అతని స్నేహితుడికి మెయిల్ పంపారు. నిజమే అనుకుని వారు పంపించిన బ్యాంకు ఖాతాకు స్నేహితుడు నగదును బదిలీ చేశాడు. మరుసటి రోజు తన మిత్రుడికి ఫోన్ చేయగా తాను మెయిల్ పంపలేదనగా స్నేహితుడు ఖంగుతిన్నాడు. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో... ఏటీఎం కార్డుకు కేవైసీ అప్‌డేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేయగా... తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన మూడు డెబిట్ కార్డుల వివరాలు చెప్పాడు. క్షణాల్లో అతని అకౌంట్ నుంచి 8 వేలు కాజేశారు.
నైజీరియన్ చేతిలో...
హైదరాబాద్‌లోని పాత బస్తీకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో ఓ నైజీరియన్ స్నేహం చేశాడు. కొన్ని రోజుల చాటింగ్ అనంతరం బహుమతులు పంపిస్తున్నానని నమ్మించాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, రుసుములు చెల్లించాలని రూ.1.24 లక్షలు వసూలు చేశాడు. మరో రూ.2లక్షలు కావాలని బుకాయించడంతో అనుమానం వచ్చిన బాధితుడు శుక్రవారం నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.