ఉమ్మడి రాష్ట్రంలో సమాచారశాఖ డైరెక్టర్‌గా పని చేసిన సీవీ నరసింహారెడ్డి కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తన తండ్రి నరసింహారెడ్డి నిర్విరామంగా కృషి చేశారని కుమార్తె రమాదేవి గుర్తు చేసుకున్నారు. తనకు నాన్నే రోల్ మోడల్‌గా నిలిచారని ఫాదర్స్ డే సందర్భంగా తెలిపారు. ఉదారతత్వం, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి గల వ్యక్తి నరసింహారెడ్డి అని.. ఆయన కలిసిన వారందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేశారన్నారు. తన తండ్రి రెండు నెలల క్రితం కన్నుమూసినప్పటికీ, ఆయన నేర్పించిన జీవితతత్వం, బోధించిన పాఠాలు ఇప్పటికీ తనకి స్ఫూర్తినిస్తాయని రమాదేవి అన్నారు.
సీవీ నరసింహారెడ్డి నల్గొండ జిల్లాలోని ఆలేరు మండలం శర్భానపురంలో జన్మించారు. ఇతనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ..భీష్మా పితామహా అని అన్నారు. అంతేగాక సీవీని "పీఆర్( పబ్లిక్ రిలేషన్స్) గురూ" అని కూడా అంటారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో దేశంలోనే మొదటి బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సును ప్రారంభించారు. ప్రజాసంబంధాల నిపుణుడిగా గుర్తింపు పొందిన నరసింహారెడ్డి ఉమ్మడి ఏపీలో నలుగురు సీఎంల వద్ద ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు
తండ్రి జ్ఞాపకాలతోనే...
భౌతికంగా తండ్రి దూరమైనా.. నిరంతరం ఆయన స్మృతులతోనే ముందుకు సాగుతున్నానని అన్నారు. ఉదయాన్నే నేను వార్త పత్రిక చదివితే... నాన్న ఒక పత్రిక అబ్బాయికి ఎలా సహాయం చేశాడో గుర్తుకొచ్చింది. తన వ్యాసాలు, అనుభవం నుంచి పాఠకులు ప్రయోజనం పొందేలా.. ఎల్లప్పుడూ కథనాలను ఎలా సమకూర్చుకుంటారో ఇప్పటికీ తనకు గుర్తుకు వస్తుందన్నారు. విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూ ప్రజా సంబంధాలపై పుస్తకాలు రాయడం ద్వారా ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. తండ్రి చేసిన కృషి ఫలితమే ఆయనను ప్రజా సంబంధాల భీష్మ పితామహగా నెలబెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రుల చిత్రపటాల ముందు...