వరుస విపత్తులతో కృష్ణా జిల్లా రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. స్వల్ప వ్యవధిలోనే వరదలు పంటల్ని ముంచెత్తుతుండటంతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రకాశం బ్యారేజీ దిగువున నదికి ఆనుకుని ఉన్న పంటపొలాలన్నీ నీట మునిగాయి. వేలాది ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. కొందరు ఈ ఏడాదే 2 పంటలు నష్టపోయిన వారుంటే.. అనేక మంది గత ఏడాదితో పాటు ఈసారీ తీవ్రంగా నష్టపోయారు.
యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు
ప్రకాశం బ్యారేజీ దిగువన యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర కరకట్ట వెంట వేలాది ఎకరాల పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాణిజ్య పంటలతో పాటు ఉద్యానపంటలు వేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారు. అరటి, పసుపు, తమలపాకు, వరి, కంద, మినుము, చెరుకు వంటి పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు మూడు రోజుల నుంచి పొలాల్లోనే నీరు నిలవటంతో ఇక పంట ఎందుకూ పనికిరాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక చోట్ల పొలాల్లో పీకల్లోతు నీరుండటంతో అది ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలీని దుస్థితి నెలకొంది.
50శాతానికి పైగా పోతేనే..
గత ఏడాది ఇదే తరహాలో పంటలను వరదలు ముంచెత్తినా ఇప్పటికీ ఎలాంటి పరిహారమూ రైతులకు అందలేదు. 50 శాతం పైబడి నష్టపోయిన పంటలనే అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకుని లెక్కలు రాసుకుంది. ఫలితంగా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లినా పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లో గత ఏడాది కేవలం 1200 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఆ పరిహారం కూడా ఇంతవరకూ రైతులకు అందలేదు.
3 మండలాలు.. 3 వేల ఎకరాలు..