Machilipatnam Municipal Corporation: మచిలీపట్నం నడిబొడ్డున దాదాపు 50కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అప్పగించింది. నిర్మాణానికి సైతం వెనువెంటనే అనుమతులు ఇచ్చేసింది. మరోవైపు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రబ్యాంకు, యూనియన్ బ్యాంక్లో విలీనం కావడంతో.. పట్టాభి సీతారామయ్య పేరిట 40 కోట్లతో మ్యూజియం, ఆడిటోరియం, నైపుణ్య శిక్షణా కేంద్రంతో పాటు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. స్థానిక ఎంపీ బాల శౌరి ఈడేపల్లిలోని పోలీసు శాఖకు చెందిన స్థలంలో 2 ఎకరాలు యూనియన్ బ్యాంకుకు అప్పగించేలా చొరవ చూపారు. దాదాపు 7నెలలుగా పట్టాభి స్మారక భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా నగరపాలక సంస్థ పాలకవర్గం ఆలసత్వం చూపుతోంది.