ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో 145, తెలంగాణలో 118 మంది తాజా, మాజీలపై కేసులు - ఏపీలో ఎమ్మెల్యేలపై క్రిమినల్​ కేసుల వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్‌ అడ్వొకేట్‌ విజయ్‌ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో ఏపీలో 145, తెలంగాణలో 118 కేసులు నడుస్తున్నాయని, అత్యధికంగా సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఉన్నాయని వివరించారు.

criminal casess on former and present mp, mlas in telugu states
మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు

By

Published : Sep 10, 2020, 10:07 AM IST

తెలంగాణ, ఏపీలో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 263 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్‌ అడ్వొకేట్‌ విజయ్‌ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో 118, ఏపీలో 145 కేసులు నడుస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని ఓ సిట్టింగ్‌ ప్రజాప్రతినిధిపై యావజ్జీవ శిక్ష పడే స్థాయి కేసు ఒకటి ఉందన్నారు.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి అమికస్‌ క్యూరీ (కోర్టు మిత్రుడు)గా హన్సారియా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్లు సమర్పించిన సమాచారం ఆధారంగా ఆయన ఈ అఫిడవిట్‌ సమర్పించారు. అందులో..

  • యావజ్జీవ శిక్ష పడటానికి వీలున్న సెక్షన్ల కింద నమోదైన చాలా కేసుల్లో ఇప్పటివరకు అభియోగాలు నమోదుకాలేదు.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో ఈ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన కోర్టుల్లో కేసులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 85 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. అధికారులు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐపీసీ సెక్షన్‌ 188 కింద నమోదైన కేసుల్లో 21 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పదేళ్ల వరకు శిక్ష పడేందుకు అవకాశం ఉన్న మరికొన్ని కేసులు గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.
  • తెలంగాణలో నమోదైన 118 కేసుల్లో 107 కేసుల్లో సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారు. ఇవన్నీ హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
  • 2012లో నమోదైన కేసులు సమన్ల జారీ దశలోనే ఉన్నాయి.

కోర్టుకు అమికస్‌ క్యూరీ చేసిన సిఫార్సులు

  • ప్రతి జిల్లాలో ఎంపీ/ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి.
  • మరణశిక్ష, యావజ్జీవ కారాగారం, ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేవి, ఇతర కేసులను ప్రాధాన్య క్రమంలో విచారించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
  • తాజా ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • జిల్లా జడ్జితో సంప్రదించి ప్రతి ప్రత్యేక కోర్టుకు కనీసం ఇద్దరు ప్రాసిక్యూటర్లను నియమించేలా రాష్ట్రాలను ఆదేశించాలి.
  • నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌ ప్రకారం ఆయా తేదీల్లో నిందితులను కోర్టుల ముందు హాజరుపరిచే బాధ్యతలను ఎస్పీలకు అప్పగించాలి.
  • క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు సాక్షులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల పార్లమెంటు, అసెంబ్లీల్లో ఇందుకు సంబంధించిన చట్టం చేసేంత వరకూ సుప్రీంకోర్టు ఇదివరకు జారీ చేసిన ‘సాక్షుల రక్షణ పథకం-2018’ను అందరికీ వర్తింపజేయాలి.
  • ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదికలను నెలరోజుల్లోపు సమర్పించేలా ల్యాబొరేటరీలను ఆదేశించాలి.
  • అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప ఏ కేసు విచారణనూ వాయిదా వేయడానికి వీల్లేదు. ఒకవేళ వాయిదా వేస్తే అందుకు కారణాలను రికార్డ్‌ చేయాలి.
  • ఏదైనా కేసులో స్టే ఇచ్చినా ఆరునెలల తర్వాత అది మురిగిపోతుంది. అందువల్ల ఆ స్టేని పొడిగిస్తూ హైకోర్టులు తాజా ఉత్తర్వులు జారీ చేయకపోతే అంతకుముందు జారీ చేసిన స్టేతో సంబంధం లేకుండా ట్రయల్‌ కోర్టులు విచారణను కొనసాగించాలి.
  • తగు ఉత్తర్వుల కోసం ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ముందే ఉంచేలా రిజిస్ట్రార్‌ జనరళ్లను ఆదేశించాలి.
  • సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుగుతోందా? లేదా? అన్నది హైకోర్టులు పర్యవేక్షించాలి. ఇందుకోసం హైకోర్టే సుమోటోగా ‘స్పెషల్‌ కోర్ట్స్‌ ఫర్‌ ఎంపీ/ఎమ్మెల్యే’ అన్న పేరుతో కేసు నమోదు చేయాలి. ఆ కేసును ప్రధాన న్యాయమూర్తి నియమించిన డివిజన్‌ బెంచ్‌ మాత్రమే వినాలి. ఇందులో కోర్టుకు సాయం చేయడానికి ఒక సీనియర్‌ అడ్వొకేట్‌ను అమికస్‌ క్యూరీగా నియమించాలి. ఈ కేసు విచారణ జరిగే ప్రతిసారీ ఐజీ ర్యాంకు స్థాయి అధికారి కోర్టుకు హాజరై అవసరమైన సమాచారాన్ని అందించేలా చూడాలి. ప్రతి స్పెషల్‌ కోర్టు ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ పురోగతిని నెలవారీగా హైకోర్టుకు సమర్పించాలి. దాన్ని వెంటనే పరిశీలించి విచారణ వేగంగా ముగించడానికి అనువైన ఆదేశాలను హైకోర్టు జారీ చేయాలి. కనీసం మూడునెలలకోసారైనా హైకోర్టు ఈ కేసు విచారణ పురోగతిని సమీక్షించాలి.

ఇదీ చదవండి:శ్రావణి కేసులో సీరియల్​ మలుపులు... కీలకంగా మారిన కాల్​ రికార్డింగ్స్​

ABOUT THE AUTHOR

...view details