ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2021, 4:09 AM IST

Updated : May 27, 2021, 4:21 AM IST

ETV Bharat / state

ప్రైవేట్ ఆస్పత్రులు వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు : సీఎం జగన్

స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల పాలనాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిర్ణీత రుసుం మాత్రమే వసూలు చేయాలన్నారు. అంతకంటే ఎక్కువగా దోపిడీ చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.

ప్రైవేట్ ఆస్పత్రులు వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు : సీఎం జగన్
ప్రైవేట్ ఆస్పత్రులు వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ చర్యలు : సీఎం జగన్

రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ చికిత్స ధరలకు మించి ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్‌ సమీక్షించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి ఎవరూ సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

స్పష్టమైన నివేదిక కావాల్సిందే..

ఆస్పత్రుల్లో ఉన్న ఆరోగ్యమిత్రల పని తీరుతో పాటు.. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమేరాల నిఘా తదితరాలపై స్పష్టమైన నివేదిక తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి పదేపదే వసూళ్లకు పాల్పడితే ఆస్పత్రి యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ సేవలు అసమానం..

కొవిడ్‌ సంక్షోభ సమయంలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమని కీర్తించిన సీఎం జగన్ వారికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాణాంతకమని తెలిసినా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆస్పత్రుల్లో రోగులకు చేస్తున్న సేవలు.. ఒక తల్లి తన బిడ్డకు మాత్రమే చేయగలదన్నారు.

ఎంత పొగిడినా తక్కువే..

ఈ మేరకు ప్రాణాలు పోసే వైద్యులను ఎంత పొగిడినా తక్కువేనని, అందుకే ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. స్పందన సమీక్షలో భాగంగా వివిధ జిల్లాల్లోని వైద్య సిబ్బందితో సీఎం వైఎస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎలాంటి సాయానికైనా సిద్ధమే..

తొలుత కర్నూలు జనరల్‌ ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుడు డాక్టర్‌ కళాధర్, విశాఖ నుంచి స్టాఫ్‌ నర్స్‌ విజయలక్ష్మి, నెల్లూరు జీజీహెచ్‌లో ఎంఎన్‌ఓగా పని చేస్తున్న సురేష్‌ బాబుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సందర్భంలో తమ నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఏవైనా పొరపాట్లు జరిగితే మనసులో పెట్టుకోవద్దని, ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రజల తరఫున సెల్యూట్..

వైద్యులు, సిబ్బంది సేవలు అమోఘమన్న సీఎం.. ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనిదన్నారు. ఎన్ని కిట్లు వేసుకున్నా, మాస్క్‌లు ధరించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి మన ప్రమేయం లేకున్నా వ్యాధి సోకే ప్రమాదం ఉందని , అయినా వెనుకాడకుండా సేవలందించడాన్ని సీఎం ప్రశంసించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజల తరపున సెల్యూట్‌ చేశారు.

'అన్ని వసతులు ఉన్నాయి'

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని, మందులు, ఔషథాలు మొదలు అన్ని వసతులు ఉన్నాయని వైద్యులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొవిడ్‌ సమయంలో ఎక్కడా ఏ లోటు లేకుండా రోగులకు సేవలందిస్తున్నామని.. ఇది తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

శాయశక్తులా కృషి..

రోగుల ప్రాణాలు కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని.. తాము మంచి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం కూడా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు.

ఇవీ చూడండి :వచ్చే నెలలో అమలు కానున్న పథకాలను ప్రకటించిన సీఎం

Last Updated : May 27, 2021, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details