విజయవాడ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఎప్పుడూ నేరాలు ఛేదించే పనిలో బిజీగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ తీరు మారింది. లాక్‌డౌన్ అమలైనప్పటి నుంచి నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో కేసుల సంఖ్య సగానికి పైగా తగ్గింది. నిత్యం పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నందున దొంగతనాలు తగ్గాయి. లాక్‌డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదలడంలేదు. ప్రైవేటు, ద్విచక్రవాహన చోదకులు పరిమితంగానే రాకపోకలు సాగిస్తున్నందున ప్రమాదాల సంఖ్య తగ్గింది. ఫలితంగా సాధారణ రోజులతో పోలిస్తే.. లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల నేరాలు తగ్గినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.
రాకపోకల నియంత్రణ
లాక్‌డౌన్ ప్రారంభించినప్పటి నుంచి నగరంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలను ఎక్కడికక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి నియంత్రించారు. ఉదయం 3 గంటలు మినహా... అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు పెట్టి.. వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 7,200 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.