కంచికచర్లకు చెందిన ముగ్గురు నిందితులు.. పోరంకికి వచ్చి మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గతేడాది అక్టోబర్ నుంచి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. ముఠాలోని ఇద్దరు యూట్యూబ్ వీడియోల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని నేరాలు చేసేవారని సమాచారం. పగటిపూట ఏదో ఒక పనిచేసుకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు నేరాలు చేసేవారు. పెద్దమొత్తంలో డబ్బు కొట్టేయాలన్న ప్రణాళికతో పోరంకిలోని ఓ ఏటీఎం దోపిడీకి పథకం రచించినా అది విఫలమైంది.
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పెనమలూరు పోలీసులు.. తొలుత ఓ అనుమానితుడిని పట్టుకున్నారు. అతడు దోపిడీ ప్రయత్నాన్ని అంగీకరించి గతంలో చేసిన నేరాలు, ప్రమేయమున్నవారి వివరాలు చెప్పాడు. దీని ఆధారంగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెనమూలురు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ముఠా నాలుగు హత్యలు చేసినా సాధారణ మరణాలుగానే భావించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విచారణలో నిందితులు చెబుతున్న వివరాల ఆధారంగా హత్యలు చేసిన ప్రాంతాలకు వెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.
తాడిగడప, పోరంకి, విష్ణుపురం, పద్మనాభ కాలనీల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను హత్య చేసి బంగారు నగలను ఈ ముఠా దోచుకెళ్లింది. ఎక్కడా మారణాయుధాలు ఉపయోగించని తీరుతో ఎవరూ హత్యగా అనుమానించలేదు. తాడిగడపలో ఓ ఇంట్లో దోపిడీ కేసుగా మాత్రమే నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో రెండు ఇళ్లకు రెక్కీ నిర్వహించినా పరిస్థితులు అనుకూలించక వెనక్కి తగ్గారు. మంగళగిరిలో కొన్ని గొలుసుల దొంగతనాలకు పాల్పడ్డారు.