మూగజీవాలపై కొంతమంది అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. వాటిని ఇంట్లో కుటుంబసభ్యులుగా ఆదరిస్తుంటారు. తాము తిన్నా, తినకపోయినా.. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటూ.. సమయానికి సేవలు చేస్తుంటారు. మరికొంతమంది అయితే.. వాటికి శుభకార్యాలు నిర్వహిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు. ఇలాంటి ప్రేమనే చాటుకుంది ఓ కుటుంబం. లేగదూడకు బారసాల నిర్వహించి గోమాతపై ఉన్న మమకారాన్ని చూపెట్టారు.
మచిలీపట్నం డాబాల సెంటర్‌కు చెందిన మైథిలి ఇంట్లో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు.. దూడకు జన్మనిచ్చింది. నెలలోపు నవజాతి శిశువులకు ఉయ్యాల వేడుక నిర్వహించే విధంగా..ఈ లేగ దూడకు సైతం కుటుంబ సభ్యులు ఘనంగా ఉయ్యాల వేడుక నిర్వహించారు. చుట్టుపక్కల వారిని పిలిచి వైభవంగా వేడుక చేశారు. ఆవుకు సైతం ఏడో నెలలో శ్రీమంతం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. లేగదూడకు సీతగా నామకరణం చేశారు.