విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు ఆందోళన చేశారు. విద్యుత్ చార్జీల భారాన్ని నిరసిస్తూ టీవీ, ఫ్యాన్, కూలర్ పట్టుకుని.. ప్లకార్డులు చేత పట్టి నిరసన తెలిపారు. వాటిని అమ్మేస్తాం అంటూ నినాదాలు చేశారు. లాక్ డౌన్ లో పనులకు వెళ్ళక ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నేతలు అన్నారు.
ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై వేలకు వేలు భారాలు వేయటం దారుణమని మండిపడ్డారు. పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని, లాక్ డౌన్ మూడు నెలలు కరెంటు బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలని, ఇతర పార్టీలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం నాయకులు కె. దుర్గారావు హెచ్చరించారు.