కృష్ణాజిల్లాలో...
కృష్ణాజిల్లా నందిగామలో 17, 18వ సచివాలయ వార్డు కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కరోనా కష్ట సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి రూ. 7500 ఇవ్వాలని, 50 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 వేతనం ఇవ్వాలని కోరారు.
సీపీఎం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విజయవాడలో సీపీఎం ఆందోళన చేపట్టింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో సాధారణ ప్రజలకు నేరుగా అందిందేమి లేదని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో...
సీపీఎం దేశవ్యాప్త నిరసనలో భాగంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 7500 ఇవ్వాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురంలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి రూ. 7500, పది కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని... లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మడకశిర పట్టణంలో సీపీఎం, ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి లేక బాధపడుతున్న ప్రజలకు ఉపాధి హామీ పథకం 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి నెల కు రూ. 7500 చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని తెలిపారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సీపీఎం కార్యాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు మళ్ల సత్యనారాయణ, బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నెలకు పది కిలోల బియ్యం అందించాలని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రతి కుటుంబానికి రూ. 7500 చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయలు చొప్పున 6 నెలలు పాటు ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం చొప్పున 6 నెలలు పాటు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:భారత్, చైనా సైనికుల ఘర్షణ- ముగ్గురు జవాన్ల మృతి