ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లేపాక్షి భూములను రైతులకే ఇవ్వాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

Ramakrishna letter to CM Jagan లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలంటూ, ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 8 వేల 844 ఎకరాల భూములు సేకరించి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినా రైతులకు నిరాశే మిగిలిందన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో 'రివర్స్ టెండరింగ్' అమలు చేసినట్లే లేపాక్షి భూముల విషయంలో ఎందుకు చేయలేదన్నారు.

rk
rk

By

Published : Aug 26, 2022, 5:42 PM IST

Ramakrishna letter on Lepakshi Scam: లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 8 వేల 844 ఎకరాల భూమి సేకరించి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినా... రైతులకు నిరాశే మిగిలిందన్నారు. ఒకప్పుడు వ్యవసాయం చేస్తూ దర్జాగా బతికినవారు ఇప్పుడు భూములు కోల్పోయి కూలీలుగా, కార్మికులుగా దయనీయ జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. చిలమత్తూరు మండలంలో భూములిచ్చిన కొందరు రైతులకు ఇప్పటికీ కనీస పరిహారం కూడా ఇవ్వలేదని, మరికొందరికి చెక్కులిచ్చి వెనక్కి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

మొత్తం 10 వేల కోట్ల విలువైన లేపాక్షి భూములను ఇప్పుడు 500 కోట్లకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేయడమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రయత్నాలకు సీఎం సహకరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై జవాబు చెప్పాలన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో 'రివర్స్ టెండరింగ్' అమలు చేసినట్లే లేపాక్షి నాలెడ్జ్ హబ్ విషయంలో ఎందుకు చేయలేదని నిలదీశారు. లేపాక్షి భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో కారుచౌకగా కట్టబెట్టిన అత్యంత విలువైన భూములవి! అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్‌ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా కేవలం రూ.500 కోట్లకే! అప్పటి కుంభకోణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌, అప్పటి ఇప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు సూత్రధారులు. దానికి కొనసాగింపుగా ప్రస్తుత స్వాహా కార్యక్రమంలో చేరిన కొత్త కంపెనీలో సాక్షాత్తూ సీఎం జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కుమారుడూ ఓ డైరెక్టర్‌. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సహనిందితులైన సంస్థలు, సన్నిహితంగా ఉన్న మరికొన్ని కంపెనీలు ఈ విషయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషిస్తున్నాయి. కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో భూ కేటాయింపులనే రద్దు చేసినా.. అప్పటికే ఈడీ జప్తులో ఉన్న భూముల్ని.. వాటిని తనఖా పెట్టుకుని రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం దివాలా ప్రక్రియ చేపట్టి చివరికి జగన్‌ సంబంధీకులకే కట్టబెట్టేస్తున్నాయి. రకరకాల పరిణామాల అనంతరం ఆ భూములన్నీ జగన్‌ సంబంధీకుల చేతుల్లోకి చేరుతున్నాయి. తనఖాలోని విలువైన భూముల్ని వేలం వేయకుండా.. రుణం మొత్తాన్ని రాబట్టుకునే అవకాశమున్నా వాడుకోకుండా.. ఎనిమిదో వంతు దక్కని ఈ బేరాన్ని బ్యాంకులు ఎందుకు అంగీకరించాయి? సీబీఐ, ఈడీ చూస్తూ ఎలా ఊరుకున్నాయి?అన్నీ సందేహాలు! అన్నీ ప్రశ్నలే!

ఇవి కూడా చదవండి:

ABOUT THE AUTHOR

...view details