Narayana reacts to CBI investigation on Kavitha: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని.. సీబీఐ విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు.
మరోవైపు దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఉదయం నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. రెండు బృందాల్లో ఉదయం వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేసుకుంటున్నారు. సీఆర్‌పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశముంది.