కరోనా అనుమానంతో ఉండి వైద్యులను సంప్రదించడానికి ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రభుత్వం యాప్‌ను తయారుచేసింది. కొవిడ్ 19 ఏపీ పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. అందులో అడిగిన మేరకు చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయగానే సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం, వైద్యుని పేర్లను తెలియచేస్తూ అతని ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. వైద్యుడిని సంప్రదించిన వెంటనే నమూనా సేకరిస్తారు. ఇలా ఎవరైనా అనుమానిత లక్షణాలతో ఉండి పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ ఈ విధమైన ఏర్పాట్లు చేసింది. సూచించిన ఆస్పత్రికి వెళ్లగానే వైద్యులు నిర్ణీత సమయంలో నమూనాలను సేకరించి పరీక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసిన నమూనాలను తిరుపతి స్విమ్స్‌లో మాత్రమే పరీక్షించగా.... తర్వాత అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనే కాకుండా ఎంపిక చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం నమూనాల సేకరణ, పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు నగరంలో 11 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా 5 చోట్ల నమూనాలు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, పలాసలో కలిపి 5 చోట్ల నిర్ణీత వేళల్లో అనుమానిత లక్షణాలతో వచ్చిన వారి నుంచి నమూనాలు తీస్తున్నారు