కృష్ణా జిల్లా గన్నవరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదు కావటంతో పాటు పట్టణ పరిసరాల్లోని ఒక్కో గ్రామంలో 25కు పైగా పాజిటివ్ బాధితులు ఉండటం పట్ల గన్నవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా రోగులతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ను కట్టడి చేసేందుకు ఓపక్క వైద్యులు శ్రమిస్తుంటే..మరోపక్క మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నియంత్రణకు వైద్యులు అందిస్తున్న సేవలను గుర్తించకుండా..,ఇటువంటి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు ప్రోత్సహించటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.