కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామానికి చెందిన అనిల్.. జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే కంపెనీలో పని చేస్తున్న ఒడిశాలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన స్వప్నతో అనిల్‌కు ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. పరస్పర అంగీకారంతో వీరిరువురూ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తగా.. స్వప్న నందిగామలో నివాసముంటోంది. ఈ ఘటనపై అనిల్ కుమార్.. చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్వప్న నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పరస్పరం ఫిర్యాదులతో.. అనిల్, స్వప్నలను పెద్ద మనుషుల సమక్షంలో ఇవాళ నందిగామ ఠాణాకు తీసుకువచ్చారు. ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన స్వప్న.. పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన అనిల్.. తాను సైతం స్వప్న చేతిలో ఉన్న డబ్బాను తీసుకొని తాగాడు. అప్రమత్తమైన పోలీసులు.. బంధువుల సహాయంతో ఇద్దరినీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.