ఆరుగాలం కష్టపడి, అధిక వర్షాలను అధిగమించి పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేకపోవడం వల్ల పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ).. కృష్ణా జిల్లాలో నేటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. సీసీఐ ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, ఏ కొండూరుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేది. ఈ సారి ఇంకా ప్రారంభించలేదు. సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ. 5550 ఉంది.
అయితే బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ప్రతి పంటకు నాణ్యత లేదని.. కేవలం రూ. మూడు వేల నుంచి నాలుగు వేలకు మాత్రమే బయట వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. పత్తి తీర్చడానికి క్వింటాకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతుంది. పంట విక్రయిస్తే కనీసం కూలీల ఖర్చురాని పరిస్థితి ఉంది. అధిక వర్షాల వల్ల పత్తి పూర్తిగా దెబ్బతినడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరానికి రెండు మూడు గంటలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొంత మంది రైతులు పంటను తొలగిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.