అవినీతికి పాల్పడుతున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ ట్రెజరీ అధికారి నాగమల్లేశ్వరరావును అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. మృతిచెందిన వారి పింఛన్లను ట్రెజరీ అకౌంట్కు పంపకుండా తన ఖాతాలోకి మళ్లించుకుంటున్నట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అనిశా అధికారులు ట్రెజరీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
పెన్షనర్లు మరణించినప్పుడు వారి వివరాలు ట్రెజరీ కార్యాలయానికి సమర్పించేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోపు వారికి ఎప్పటిలాగే పింఛన్ విడుదలవుతుంది. మృతి చెందినవారి వివరాలు సంబంధిత అధికారులు జత చేయగానే ఆ నగదు ట్రెజరీ అకౌంట్కు మళ్లించాలి. అయితే ఆ సొమ్మును నాగమల్లేశ్వరరావు తన ఖాతాకు మళ్లించుకుంటూ వాటిని సొంత ఖర్చులకు వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2016 నుంచి ఈ విధంగా సుమారు రూ. 29 లక్షల రూపాయలు తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఏసీపీ జేడీ రవికుమార్ చెప్పారు.