కృష్ణా జిల్లాలో ఒక్క రోజులో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందారు. గత రెండు రోజుల్లోనే 50 పాజిటివ్ కేసులు జిల్లాలో బయటపడ్డాయి. బయట ప్రాంతాల నుంచి రాకపోకలు పెరిగినందున కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ నగరంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. నగరవాసులు నిర్లక్ష్యంగా ఉండటమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోందని అధికారులు అంటున్నారు. కరోనా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకూ... 342 మంది డిశ్చార్జ్ అయ్యారు.
వన్ టౌన్, కృష్ణలంక , కొత్త పేట , చిట్టినగర్ , సింగ్ నగర్ , గొల్లపాలెంగట్టు , శ్రీనివాసనగర్ సహా పలుప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నగరంలోని మల్లికార్జునపేటకు చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు. వీరిలో తండ్రికి తొలుత వైరస్ సోకింది. ఇతను వన్ టౌన్ లో ఓ దుకాణం నిర్వహిస్తుంటంతో...అతనికి ఎవరి ద్వారా వైరస్ సోకిందో తెలియదు. ఇతని ద్వారా మిగిలిన కుటుంబసభ్యులు నలుగురు వైరస్ బారిన పడ్డారు. వీరందరినీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.