కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, కంచికచెర్ల, చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకా కొరతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా విజృంభిస్తుండగా.. వ్యాక్సిన్ కోసం ప్రజలు ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారం రోజులుగా నందిగామ ఆస్పత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై.. నిరాశగా వెనుతిరుగుతున్నారు.
మొదటి డోస్ తీసుకున్నవారూ.. రెండో డోస్ కోసం కేంద్రాల వద్దకు వస్తున్నారు. టీకా కొరతతో వారిని వెనక్కి పంపేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయల్లోనూ టీకా వేస్తామని చెప్పినా.. కొన్ని చోట్ల ఆ పరిస్థితి లేదు. సోమవారానికి టీకా వస్తుందని.. అప్పుడు వేస్తామని చెప్పి ప్రజలను వెనక్కి పంపుతున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.