దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా...ఏపీలోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్లు డ్రైరన్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ డ్రైరన్ జరగనుంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, ఉప్పులూరు పీహెచ్‌సీ, పూర్ణ హార్ట్ ఇన్‌స్టిట్యూట్, కృష్ణవేణి కళాశాల, ప్రకాశ్‌నగర్ ఆస్పత్రిల్లో డ్రై రన్ మెుదలుపెట్టారు.
టీకా డ్రై రన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన చేస్తారు. కొవిన్ యాప్ పరిశీలన, ఇతర సమస్యలు తెలుసుకునేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
సజావుగా వ్యాక్సిన్ డ్రై రన్
కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ కృష్ణాజిల్లాలో సజావుగా సాగుతోందని రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవి తెలిపారు. తాడిగడపలోని వ్యాక్సిన్ డ్రై రన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి... అధికారులతో మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత ప్రజలకు అందించేందుకు సన్నాహకంగా ఈ డ్రై రన్ కార్యక్రమం జరుగుతోందని ఆమె తెలిపారు. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.