విశాఖ జిల్లా చోడవరంలోని మంబలంలో కొవిడ్ టీకా వారోత్సవం బుధవారం ప్రారంభమైంది. చోడవరం-1 పరిధిలోని వార్డు, గోవాడ సచివాలయాల్లో 45 ఏళ్లు దాటిన వారికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. గోవాడలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.పద్మాలత ప్రారంభించారు.
విశాఖలో జిల్లాలో..
చోడవరం పరిధిలో టీకా అందజేత కార్యక్రమం సంతృప్తికరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. టీకా వారోత్సంలో భాగంగా సుమారు 500 డోసులు తమ కేంద్రానికి అందాయని గవరవరం పీహెచ్సీ వైద్యాధికారిణి దమ్రు వివరించారు. వ్యాక్సిన్ వేసుకునే వారికి ముందుగా బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. టీకా వేశాక అరగంట సేపు వైద్య బృందం పరిశీలనలో ఉంచి అనంతరం ఇంటికి పంపించేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏడువాక అమ్మియమ్మ, ఉప సర్పంచ్ వెంకట నాగేశ్వరరావు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, బేరా సత్యరావు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను చేపట్టారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు టీకా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని టీకాను వేయించుకుంటున్నారు.
టీకా ఉత్సవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి వ్యాక్సిన్‌పై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 62.43 శాతం వ్యాక్సినేషన్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.