కండక్టర్లు లేకుండా బస్సులు నడిపే విధానాన్ని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇకపై పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కండక్టర్లతోనే నడపనుంది. కండక్టర్లను కొనసాగిస్తూనే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు పక్కన పెట్టిన ఏసీ బస్సులను సైతం రోడ్డెక్కనున్నాయి. కొవిడ్ సోకకుండా బస్సుల్లో నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.
కండక్టర్లు లేకుండా బస్సులు నడపాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ వెనక్కి తీసుకుంది. మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తీసుకొచ్చిన ఈ విధానాన్ని పక్కన పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లె వెలుగు ఎక్స్ ప్రెస్ బస్సులను కండక్టర్లతో తిప్పనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కండక్టర్లు లేకుండానే బస్సులను తిప్పాలని మే నెలలో నిర్ణయించారు. దీంతో కండక్టర్లు బస్టాప్‌లు, రిజర్వేషన్ కేంద్రాల వద్ద ఉంటూ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. దీన్ని శాశ్వతంగా అమలు చేసేలా ఆర్టీసీ యోచించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా మిగిలిన కండక్టర్లను కార్గో సర్వీసు సహా పొరుగు సేవల సిబ్బంది పనిచేసే స్థానాల్లో నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. కండక్టర్ లేకుండానే పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా కీలక చర్యలు తీసుకోవడంతో కార్మిక సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కండక్టర్లను ఉపయోగించుకుంటూనే డిజిటల్ లావాదేవీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇకపై ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానం సహా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ టికెట్ల జారీ మరింత పెంచనున్నారు.