విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో సాక్ష్యాత్తు మంత్రులు పాల్గొన్న సభలో కొవిడ్ నిబంధనలు యథేచ్చగా బేఖాతరయ్యాయి. బీసీ కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్లగా నియమితులైన వారి సన్మాన కార్యక్రమం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కొడాలి నాని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సహా కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైకాపా నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యులు పాల్గొన్న ఈ సభలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా నిర్వహకులు నిర్లక్ష్యం వహించారు.
లాక్డౌన్ అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతివ్వలేదు. ఆ సమయంలో ఇక్కడ వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించేవారు. 7 నెలల తర్వాతా ఆడిటోరియంలో సభకు అనుమతించగా భారీ సంఖ్యలో ప్రజలను లోపలికి అనుమతించారు. నిబంధనల ప్రకారం ఆడిటోరియంలో భౌతికదూరం పాటిస్తూ సీట్లూ కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా కనిపించలేదు. చాలా మంది మాస్కులు ధరించనప్పటికి లోపలికి అనుమతించారు. ఆడిటోరియంలో బయటకు గాలి వెలుతురు ప్రసరించేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించలేదు.