పాఠశాల బస్సులు, ఆటోలకు కరోనా నిబంధనలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు పాఠశాలకు నడిచి లేదా బైక్‌పై వచ్చేలా పాఠశాల యాజమాన్యాలు ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించింది.
బస్సుల్లో పాటించాల్సింది ఇవే
- విద్యార్థులు ఎక్కక ముందు, ఇళ్ల వద్ద వదిలి పెట్టిన అనంతరం పాఠశాల బస్సులను శుద్ధి చేయాలి
- బస్సుల్లో అధిక సామర్థ్యం కలిగిన గాలి ఫిల్టర్లను ఏర్పాటు చేయాలి
- సీట్ల వరుసకు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలి
- బస్సుల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం ఉండాలి
- కరోనా నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లను బస్సు లోపల, బయట ప్రదర్శించాలి
- విద్యార్థులు, డ్రైవర్, అటెండర్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లను తప్పక ధరించాలి
- డ్రైవర్ గ్లాస్‌తో క్యాబిన్ ఏర్పాటు చేసుకోవాలి
- బస్సుల కిటికీలను తెరచి ఉంచాలి... ఏసీలను వినియోగించకూడదు
- బస్సుల్లో అటెండర్ తప్పనిసరిగా ఉండాలి
- విద్యార్థులు బస్సు ఎక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ తప్పక నిర్వహించాలి
- పిల్లలు బస్సు ఎక్కేందుకు ముందుగానే తప్పనిసరిగా చేతులు శుభ్రపరచుకునేలా చర్యలు తీసుకోవాలి
- పుస్తకాలు, లగేజీని శానిటైజేషన్ చేశాక నిర్ణీత ప్రదేశంలో ఉంచాలి
ఆటో రిక్షాలకు నిబంధనలు
- పిల్లలను తీసుకుపోయే ముందు ఆటోను తప్పని సరిగా సోడియం హైపో క్లోరైడ్‌తో శుద్ధి చేయాలి
- ఆటో డ్రైవర్ విధిగా మాస్క్ ధరించాలి
- ఆటోల్లో పిల్లలను ఎదురెదురుగా కూర్చోబెట్టకూడదు.
- మాస్క్‌లు ధరించిన పిల్లలను మాత్రమే ఆటోల్లోకి అనుమతించాలి
- ఆటోలో శానిటైజర్ తప్పక ఏర్పాటు చేయాలి
- ఆటోలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ప్రయాణానికి అనుమతి