రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల అలజడి రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వేగంగా కేసులు పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 10 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో గత 10 రోజుల్లో 186 కేసులు నమోదైనట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
జగ్గయ్యపేటలో ఐదు కుటుంబాల్లో 40 మందికి కరోనా సోకింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఓ మార్గమైతే... ప్రజలే స్వయంగా జాగ్రత్తలు పాటించటం మరో మార్గమని అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న కృష్ణా జిల్లాలో రెండు సచివాలయాల పరిధిలో ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పోరంకి, ఇబ్రహీంపట్నం సచివాలయాల్లో... ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని కలెక్టర్ చెప్పారు.
విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులూ కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లాలో ఇటీవల ఒకే విద్యా సంస్థలో పది కేసులు నమోదుకాగా... కృష్ణా జిల్లా జక్కంపూడిలోని ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తరగతి గదుల్లో విద్యార్థులు కరోనా నియంత్రణ చర్యలు పాటించకపోవటమే దీనికి కారణంగా కనిపిస్తోంది.