ప్రతి ఆరుగురు యువ జనాభాలో ఒకరు ఉపాధికి దూరం..! ఉద్యోగం చేస్తున్న వారి పని గంటల్లో 23% కోత..! ఆ మేరకు తగ్గిన వేతనం..! ఇదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మిగిల్చిన నష్టం. ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్‌డౌన్ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగానే కనిపిస్తోంది. అన్నింటికన్నా ఉపాధి రంగం బాగా ప్రభావితమైంది. అసంఘటిత రంగంలోని చిరుద్యోగులపై, ఇతర ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడింది. ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు ఇదే విషయం వెల్లడించాయి కూడా. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్‌ఓ సైతం ఇదే ధ్రువీకరిస్తోంది. కరోనా కారణంగా... యువజనాభా పైనే ఎక్కువగా ప్రభావం పడిందని తేల్చి చెప్పింది...ఐఎల్‌ఓ . ఫిబ్రవరి నుంచి నిరుద్యోగ రేటు కూడా గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది.
యువతపై కరోనా దెబ్బ..
యువత ఉపాధి అవకాశాలు దెబ్బ తీయటమే కాదు...విద్య, నైపుణ్యాలు పెంచుకునేందుకు అనువైన శిక్షణ లాంటి పలు అంశాలపైనా ప్రభావం చూపింది కరోనా. ఫలితంగా చాలా మంది యువతీ యువకులు...కాయకష్టం ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేసేందుకూ వెనకాడటం లేదు. 2019లోనే ప్రపంచవ్యాప్తంగా యువ జనాభాలో నిరుద్యోగ రేటు 13.6%గా నమోదైంది. అదే ఇప్పటి వరకు అత్యధికం. 26 కోట్లకుపైగా యువత ఏ ఉద్యోగావకాశాలకు దూరంగా ఉన్నారని ఐఎల్‌ఓ చెబుతోంది. 15-24 ఏళ్ల మధ్య వయసుల్లో కొందరు ఉద్యోగం చేస్తున్నా.. వారిని తక్కువ వేతనాలు, ప్రమాదకర పని ప్రాంతాలు లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు కరోనాతో ఈ పరిణామాలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఈ లాక్‌డౌన్ ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తోంది..ఐఎల్‌ఓ .
ప్రతిభకు దక్కని పీఠం..
ప్రతిభ, అవకాశం..! ఈ రెండే ఎవరినైనా అత్యున్నత స్థాయిలో నిలబెడతాయి. కానీ... కరోనా కారణంగా...ప్రతిభ ఉన్న వారికీ అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వారి భవిష్యత్‌ని అగమ్యగోచరంగా మార్చింది...లాక్‌డౌన్. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయట పడి మళ్లీ సాధారణ జీవనం సాగించేలా ఉద్యోగం సంపాదించటం...వీరందరికీ కత్తిమీద సామే. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విధివిధానాలు లేకపోవటం మరింత సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యాదాయ దేశాల్లో ఉద్యోగ భద్రత కల్పించటంపై పెద్దగా దృష్టి సారించటం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వాలూ ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు చిరుద్యోగులు చితికిపోవాల్సి వస్తోంది.
వారిని ఈ పనులకే వాడుతున్నారు !
ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పనికి దూరమైన వారు మళ్లీ పనిలో చేరేందుకు అనువైన వాతావరణం సృష్టించటం కీలకమని సూచిస్తోంది...ఐఎల్‌ఓ. కరోనా అనుమానితులను గుర్తించటం, ఎక్కువ మొత్తంలో పరీక్షించటం లాంటి చర్యలు చేపడుతున్న దేశాల్లో పని గంటలు సగటున 50% తగ్గి పోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా...పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలన్న నిబంధన వల్ల చాలా మంది పనికి దూరమవుతున్నారు. అయితే...టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ వల్ల ఉపాధి కోల్పోయిన వారితో పాటు... కొత్త ఉద్యోగావకాశాలు పొందుతున్న వారూ ఉన్నారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు యువతనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ తాత్కాలికంగా ఈ పని చేసేందుకు నియమించుకుంటున్నారు.