లాక్డౌన్ తర్వాత అన్ని వెసులుబాటులు ప్రభుత్వపరంగా వచ్చినా.. అరకొర సిబ్బందితో 30 శాతం పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి. రిటైల్ మార్కెట్ పెరగక, వ్యాపారులు ముడి సరకు కొనుగోలు చేయటం ఆపేశారు. లాక్డౌన్ కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని ఉత్పత్తి ప్రారంభించినా.. మార్కెటింగ్ పరిస్థితులు అనుకూలించక యూనిట్లను మూసేయాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా లారీలు రోడెక్కకపోవటంతో... తయారు చేసిన ఉత్పత్తికి రవాణా లేకపోవటం పరిశ్రమలకు గుదిబండగా మారింది. సాధారణ పరిస్థితుల్లో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి చేసేవాళ్లు... ప్రస్తుతం ఒక షిఫ్టులో ఉత్పత్తి కష్టంగా ఉంటుందని అంటున్నారు. మార్కెట్ అనుకూలించక ఉత్పత్తి తగ్గించినవారు కొందరైతే.. కరోనా కారణంగా ఖర్చుల నియంత్రణలో వచ్చిన మార్పులు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. పరిశ్రమలు మూసివేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తర్వాత ప్రారంభమైన వ్యాపార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉంటాయనుకున్న పారిశ్రామికవేత్తలకు నిరాశే ఎదురవుతోంది. తయారీ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన మార్కెట్ ఇంకా తెరుచుకోకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ పుంజుకోవాలంటే ప్రజారవాణాతో పాటు ఇతర నిబంధనలు సడలించాల్సి ఉండటంతో.. నామమాత్రంగానే పరిశ్రమలు నడుస్తున్నాయి. తెరుచుకున్న పరిశ్రమల్లో కూడా 30శాతం సిబ్బందే పని చేస్తున్నారు. సగానికి సగం వరకూ ఉత్పత్తులను తగ్గించేసి ఉన్న సిబ్బందినే రోజు విడిచి రోజు వచ్చేలా ప్రణాళికలు చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాండెడ్ వస్తువులకూ డిమాండ్ తగ్గింది. ప్రజల్లో ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన పెరగడటమే దీనికి ఓ కారణమని వ్యాపారులు చెప్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో కూడా వస్త్రాల విక్రయాల్లోనూ ఇదే తీరు ఉందని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో జరిగిన వ్యాపారంలో కనీసం 10శాతం కూడా లేదని వాపోతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే విద్యుత్ బిల్లు చెల్లించటమూ కష్టమవటంతో పాటు..., అద్దె భారమూ భరించలేని పరిస్థితి నెలకొందని కలత చెందుతున్నారు.
మార్కెట్‌పై వీడని కరోనా మేఘాలు.. నష్టాల్లోనే పరిశ్రమలు - పరిశ్రమలపై కరోనా ప్రభావం న్యూస్
కరోనా ప్రభావం నుంచి సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఇంకా కోలుకోలేదు. మార్కెటింగ్ పరిస్థితులు అనుకూలించక ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మూతపడగా... మరికొన్ని కష్టాలతో నెట్టుకొస్తున్నాయి. కొవిడ్ ప్రభావంతో రిటైల్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితం కాగా... తయారు చేసిన ఉత్పత్తులు పేరుకుపోతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలకు వచ్చే అరకొర సిబ్బందిలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే మిగిలిన వారూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. వైద్య పరీక్షలకు పేరు నమోదు చేసుకుంటే 2రోజుల తర్వాత నమూనాలు సేకరిస్తున్నారని..., వారం తర్వాత ఫలితం వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు చెప్తున్నారు. అప్పటి వరకూ సిబ్బందిని సెలవుపై ఉంచాల్సి రావటం, పూర్తి స్థాయిలో ఆర్టీసీ సిటీ బస్సుల పునరుద్ధరణ వంటివి లేకపోవటమూ సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి:మైలవరంలో రెవెన్యూ అధికారులతో జేసీ సమీక్ష