కరోనా దెబ్బకు మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. ఇటీవలి టమోటాకు ధరలేక తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రస్తుతం మిర్చి విషయంలోనూ అదే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కోత కోసిన పంటను కొనే నాథుడే లేక రైతు దిగాలు చెందుతున్నాడు. అధికంగా పండే టమోటా, మిర్చి రైతులను కరోనా వరుసగా రెండేళ్లు నిలువునా ముంచేసింది.
దివిసీమ ప్రాంతంలో మిర్చి దాదాపు 350 ఎకరాల్లో పండించారు. కరోనా వల్ల నెల రోజులుగా ఎగుమతులపై ప్రభావం పడింది. కొనే వారు కూడా రావడం లేదు. మోపిదేవి మండలంలో చాలా మంది రైతులు టమోటాతో పాటు మిర్చి కూడా పండిస్తారు. కరోనా ప్రభావం ప్రారంభ సమయంలో 50 కిలోల బస్తా దాదాపు రూ.1000 వరకు పలికేది. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో పాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 50కిలోల బస్తా రూ.300-400 మాత్రమే పలుకుతోంది. అది కూడా రైతు బజార్లకే పంపుతున్నారు. దీంతో కోత కోయకుండా రైతులు పంటను వదిలేస్తున్నారు. మంచి లాభాలను తీసుకొచ్చే సమయంలో టమోటా, మిర్చి డీలా పడడం రైతులను కుంగదీస్తోంది. చేసిన అప్పులు కళ్లెదుట తిరుగుతున్నాయి. లాక్‌డౌన్, కర్ఫ్యూ నేపథ్యంలో పంట కోతను మానివేశారు. కొంతమంది రైతులు తోటలను తొలగించేస్తున్నారు. ఓ వైపు కరోనా భయం, మరో వైపు ధరలేక అప్పులు పాలవుతున్న రైతులు తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటకు సమాయత్తమవుతున్నారు.