ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ప్రభావం: మామిడి రైతు కుదేలు - కృష్ణా జిల్లాలో మామిడిరైతుల కష్టాలు వార్తలు

రెండేళ్లుగా కరోనాతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. ప్రాణాలు కాపాడుకుంటూ పొట్టకూటి కోసం పంట వేస్తే..దానిని విక్రయించలేక నానా అవస్థలు పడుతున్నారు. పంటను అమ్ముకునే వెసులుబాటు వచ్చినా గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారు.

mangos
ఎగుమతికి నోచని మామిడి కాయలు

By

Published : May 30, 2021, 8:26 PM IST

దేశవ్యాప్తంగా పలు రంగాలపై ప్రభావం చూపుతున్న కరోనా రెండేళ్లుగా మామిడి రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. గత ఏడాది సీజను ఆరంభం నుంచి కొవిడ్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో కనీసం పంట కోసి విక్రయించుకునేందుకు అవకాశం దొరకని పరిస్థితి. నాటి నష్టాల నుంచి ఈ ఏడాదైనా కోలుకుందామనుకునేలోగా మళ్లీ కరోనా మరోమారు దెబ్బతీసింది.

కృష్ణా జిల్లావ్యాప్తంగా సుమారు మూడు లక్షల ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్నారు. దీనిలో రెండు లక్షలకు పైగా బంగినపల్లి రకం మామిడి, మరో లక్ష ఎకరాల్లో చిన్నరసం, పెద్దరసం, తోతాపురి తదితర ఇతర రకాలను పండిస్తున్నారు. అగ్రభాగంలో సాగవుతున్న బంగినపల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయటం మినహా రైతులకు ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడి నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారులు సీజను ఆరంభంలో ఇక్కడికి వచ్చి, పంట కొనుగోళ్లు జరుపుతారు. రెండేళ్లుగా ఏర్పడిన కరోనా పరిస్థితుల కారణంగా ఎగుమతులు నిలిచిపోవటంతో రైతులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఏటా ఇక్కడి నుంచి సుమారు 5వేల టన్నుల వరకు మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండగా, గత ఏడాది మొత్తంమీద పదిశాతం (500 టన్నులు) ఎగుమతికి నోచుకోకపోవటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 400 టన్నుల మామిడి ఎగుమతి అవ్వగా, కొద్దిరోజులుగా ఇవి నిలిచిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఇక్కడి పంటను రైతుల నుంచి కొని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినా, అక్కడ మార్కెట్లలో అమ్ముకునేందుకు అవకాశాలు లేకపోవటమే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు. జిల్లాలో తక్కువ మొత్తంలో సాగవుతున్న చిన్న, పెద్దరసం మామిడికి స్థానికంగా గిరాకీ ఉండటం, తోతాపురి రకం మామిడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ పరిశ్రమల్లో కొనుగోలుకు అవకాశాలు ఉండటంతో కొంతమేరకు పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ ఏడాది ఈ రకం మామిడి ధరలు సైతం తీవ్రంగా పతనమవ్వటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్ముకునేందుకు ఆస్కారం ఏదీ?

ఈ ఏడాది పరిస్థితులు మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకవైపు కరోనా ఆంక్షల కారణంగా మూతపడిన మార్కెట్లు, మరోవైపు ప్రతికూల పరిస్థితుల రూపంలో తీరని నష్టాలకు గురిచేశాయి. ఇటు ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులతో భారీ వర్షాలు, ఈదురుగాలులు, అటు చూస్తే తోటల్లోనే పాడయ్యే పరిస్థితి నుంచి పంటను రక్షించుకునేందుకు కోత కోస్తే కొనే నాథుడు దొరకని దుస్థితి. అయినకాడికి పంటను అమ్ముకుందామనుకున్నా, అంతంతమాత్రంగానైనా ధర లభించటంలేదు. ఒకప్పుడు టన్ను రూ.లక్షకు పైగా అమ్మిన బంగినపల్లి రకం మామిడిని ప్రస్తుతం రూ.20 వేలకు కొనేవారు లేరు. తోతాపురికి టన్నుకు రూ.5వేల నుంచి రూ.6వేలకు మించి రావటంలేదు. ఇది కోత కోసి, మార్కెట్‌కు తరలించేందుకు అయ్యే వ్యయానికి కూడా చాలకపోవటంతో తోటల్లోనే కాయలను వదిలివేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కూలీలను తోటల్లోకి తీసుకెళ్లటం, పంటను సురక్షితంగా తరలించటం కష్టాలతో కూడిన వ్యవహారంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్లు మూసివేయడంతో ఎగుమతి చేసిన పంటను విక్రయించుకునే అవకాశం లేదని జిల్లాలో కొన్నేళ్లుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఆంజనేయులు, రాయల కృష్ణయ్య తెలిపారు. కరోనా నష్టాలు మరో ఐదేళ్ల పాటు, ఇటు రైతులు, అటు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పారు.

కోసేందుకు సైతం వీల్లేక...

గత ఏడాది కరోనా ఆంక్షలు కచ్చితంగా సీజను ఆరంభమైన ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో చేతికొచ్చిన పంటను కోసేందుకు కూలీలను సైతం తోటల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. మరోవైపు కూలీలకు పని దొరక్క, ఉపాధి లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎలాగోలా తోటల్లోని పంటను కోసినా, ఆంక్షల కారణంగా విక్రయించుకునేందుకు మూసివేసిన మార్కెట్లు దర్శనమివ్వటంతో ఏం చేయాలో పాలుపోని దురవస్థ ఎదురైంది. మరోవైపు స్థానికంగా పంట కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే సంస్థలు మూతపడటంతో ఇక్కడ పనిచేసేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు కాలిబాటన కుటుంబాలతో సహా సొంత ప్రాంతాలకు వెళ్లారు.

ఇదీ చూడండి.Viral: నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details