వందల సంఖ్యలో అతిథులు.. ఆత్మీయ ఆలింగనాలు.. విందులు.. వినోదాలు.. విద్యుద్దీపాల వెలుగులు.. సినిమా సెట్టింగుల్లా మండపాలు.. మెహందీ ఫంక్షన్లు, సంగీత్‌లు, బారాత్‌లు.. మార్చి 22 వరకు పెళ్లిళ్లు జరిగిన తీరిది. వరుడు, వధువు.. కుటుంబసభ్యులు.. మరీ ముఖ్యమైన బంధుమిత్రులు.. రెండు చుక్కల శానిటైజర్.. ఒక మాస్క్.. ఇంటి ఆవరణో... చిన్న వేదికో.. వివాహాన్ని పూర్తి చేస్తోంది. కరోనా చూపిన ప్రభావం ఇది.
కరోనా దెబ్బకు మారిన పెళ్లి స్వరూపం
రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లో వేలాది వివాహాలు జరగాలి. లాక్డౌన్ దెబ్బకు 90 శాతం వాయిదా పడ్డాయి. ముహూర్తం మార్చకూడదనుకున్నవారు.. హంగూ, ఆర్భాటం లేకుండా జరిపించేశారు. వివాహాలకు ఏర్పాట్లు చేయడం ఒక పరిశ్రమలా మారిపోయిన ఈ రోజుల్లో... దానిపై ఆధారపడిన వేల మంది ఉపాధి కోల్పోయారు.
ఆగస్టు నుంచి ముహూర్తాలు
ఏప్రిల్, మే 13, 14 తేదీల్లో గట్టి ముహూర్తాలు ఉన్నాయి. ఆ సమయంలో అన్నవరం వంటి దేవాలయాల్లో వేల పెళ్లిళ్లు జరగాల్సి ఉందని అంచనా. కరోనాతో అవన్నీ వాయిదా పడ్డాయి. వీరితోపాటు, కొత్తగా ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నవారికి ఆగస్టు వరకు అవకాశాలు లేవని పురోహితులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు ముహూర్తాలున్నాయని, అప్పుడు పెళ్లిళ్లు చేసుకోవాలని చాలా మంది వేచిచూస్తున్నారు.
గణనీయంగా తగ్గనున్న ఖర్చు
పెళ్లిళ్లు ఆడంబరంగా చేయడం ఇటీవల పెరిగిపోయింది. స్థోమతని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. కొందరు మొత్తం బాధ్యతల్ని ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు.
కరోనా దెబ్బకు అన్ని రకాల వివాహాల ఖర్చు గణనీయంగా తగ్గనుంది. రాబోయే రోజుల్లో లాక్డౌన్ సడలించినా ఒకే చోట ఎక్కువ మంది గుమికూడే పరిస్థితులు ఉండకపోవచ్చు! ఈ మేరకు ప్రభుత్వ ఆంక్షలూ కొనసాగే అవకాశముంది.దీంతో రూ.20 లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నవారు, రూ.5 లక్షల్లోనే పెళ్లి కానిచ్చే అవకాశముంది.
విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు అక్కడివారితోనే సంబంధాలు కుదుర్చుకున్నా, బంధుమిత్రులంతా ఉంటారని ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు అక్కడే సాదాసీదాగా కల్యాణం చేసుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడిన వారితో సంబంధాలు కదుర్చుకున్న ఇక్కడివారు రాకపోకలు నిలిచిపోవడంతో వివాహాలు వాయిదా వేసుకున్నారు.