ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘ఆక్వా’కు ఆటంకం లేదు

కరోనా వైరస్‌ అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై ఎక్కువగా ఉండడంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. దీంతో వ్యవసాయరంగంతోపాటు మత్స్యశాఖ అనుబంధంగా ఉన్న అన్నింటికీ మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసినా చాలామందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

corona effect on aqua field in krishna district
corona effect on aqua field in krishna district

By

Published : May 18, 2021, 6:46 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.62 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. మచిలీపట్నం, కృత్తివెన్ను, నాగాయలంక, కైకలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, బంటుమిల్లి, పెడన, నందివాడ ఇలా జిల్లాలోని పలు మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ ద్వారా ప్రతి నెలా రూ.100కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిలో సముద్ర ఉత్పత్తుల వాటా రూ.30కోట్లు ఉండగా రూ.70కోట్లు చెరువుల ద్వారా వచ్చే ఉత్పత్తులు ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇవి ఎగుమతి అవుతుంటాయి. ఎగుమతులు నిలిచిపోతే రైతులు, మత్స్యఉత్పత్తులు పట్టుబడిచేసే వారు, ఉత్పత్తులను ఐస్‌తో ప్యాకింగ్‌ చేసే కార్మికులు, ఐస్‌ప్లాంట్‌లలో పనిచేసే కార్మికులు, అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా ఉపాధికోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిమితి మేరకు అనుమతులిచ్చారు.

అవకాశం ఇచ్చినా ..

మత్స్య ఉత్పుత్తులను ప్రాసెసింగ్‌చేసే పరిశ్రమలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 50శాతం కార్మికులతో పరిశ్రమల్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ఆయా గ్రామాలకు వచ్చే కార్మికులను తగు జాగ్రత్తలతో పరిశ్రమల బస్సుల్లో తీసుకురావచ్ఛు ఉత్పత్తులను ఎగుమతిచేసే వాహనాలను కూడా అనుమతిస్తారు. ప్రస్తుతం వేసవి కావడంతో చెరువుల్లో చేపలు, రొయ్యలు వ్యాధులకు గురవుతుంటాయి. ఏ సమయంలో అయినా రైతులు చెరువులవద్దకు వెళ్లి రావచ్ఛు మేత వాహనాలను కూడా పరిశ్రమలనుంచి చెరువుల వద్దకు అనుమతిస్తారు.ఇలా మత్స్యరంగానికి చెందిన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వెసులు బాటు కల్పించినా చాలామందికి ఈ విషయం తెలియక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎగుమతులకు అవకాశం లేదన్న కారణంతో ఉత్పత్తులను స్థానికంగానే అయిన కాడికి అమ్ముకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి విస్తృత ప్రచారం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

గుర్తింపుపత్రం చూపాలి

మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి రవాణా వాహనాలు, పరిశ్రమల నిర్వహణ, ఇలా మత్స్యరంగానికి సంబంధించి ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆక్వా రైతులు నష్టపోకుండా ఉండాలన్న లక్ష్యంతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వాహనాలకు ఆక్వా వాహనం అనే పోస్టరు అతికించాలి. పోలీసులు అడిగినప్పుడు మత్స్యశాఖ జారీ చేసిన లైసెన్సు, గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక మత్స్యశాఖ అధికారులకు చెబితే వెంటనే పరిష్కరిస్తాం. -షేక్‌లాల్‌మహ్మద్‌, మత్స్యశాఖ జేడీ

జిల్లాలో ఆక్వా సాగులో ఉన్న రెవెన్యూ గ్రామాలు: 238

మొత్తం సాగు విస్తీర్ణం: 1.62 లక్షల ఎకరాలు


ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు

ABOUT THE AUTHOR

...view details