పెళ్లంటే నగలు, దుస్తులే కాదు.. కొత్తకాపురానికి అవసరమైన వంట సామగ్రి కూడా ముఖ్యమే. అటువంటి వస్తువులకు చిరునామా అల్యూమినియం, స్టీలు పరిశ్రమలు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఈ వస్తువుల తయారీ పరిశ్రమలు దాదాపు 100 వరకూ ఉన్నాయి. ఈ పరిశ్రమలపై ఆధారపడి దాదాపు 10 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలపాటు ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. సడలింపులతో తిరిగి తెరుచుకున్నా.. మార్కెట్ లేని కారణంగా ఉత్పత్తుల తయారీపై ప్రభావం పడింది.
కొనుగోళ్ల మందగమనం, సిబ్బంది కొరతతో.. ఉత్పత్తి కూడా నామమాత్రంగా నడుస్తోంది. ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి మార్కెట్ ఇంకా తెరుచుకోకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ పుంజుకోవాలంటే ప్రజారవాణాతో పాటు ఇతర నిబంధనలు సడలించాల్సి ఉండటంతో నామమాత్రంగానే పరిశ్రమలు నడుస్తున్నాయి.
తెరుచుకున్న పరిశ్రమల్లోనూ 30 శాతం సిబ్బందే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఉత్పత్తులను సగం తగ్గించినట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. అల్యూమినియం ఉత్పత్తులకు డిసెంబర్ నుంచి జూన్ నెల వరకు సీజన్ ఉంటుందని, కానీ ఈ ఏడాది లాక్డౌన్ వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. రవాణా లేకపోవటంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముడి సరకు కూడా రావటంలేదంటున్నారు.