విజయవాడ నగరంపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఈ మహమ్మారి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గడిచిన 72 గంటల్లో బెజవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 91 కేసులు నమోదు కావడం భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ప్రస్తుతం 140 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయి. 29 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా 8 మంది మృతిచెందారు. గత 3 రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది.
లాక్ డౌన్ మరింత కఠినతరం
వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తాజాగా నగరంలో 52 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 24 కృష్ణలంక ప్రాంతంలోనే ఉన్నాయి. 18 కేసులు మాచవరం పరిధిలోని కార్మికనగర్‌లో ఉండగా.. ఖుద్దూస్ నగర్లో 4, జింఖానా గ్రౌండ్స్ సమీపంలో 4, గూడవల్లి ప్రాంతంలో 2 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా గత 3 రోజులుగా అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. కేసులు ఎక్కువగా నమోదైన కృష్ణలంక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసు వాహనాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ బయటకు రావద్దని.. నిబంధనలు ఉల్లఘించి ఎవరైనా బయటకు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.