కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లాక్డౌన్ సడలింపులు వచ్చినా ఉత్పత్తి అంతంతమాత్రమే జరుగుతుంది. మూతపడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభమైనా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని వివిధ పారిశ్రామిక వాడల్లో దాదాపు వెయ్యికి పైగానే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. నూజివీడు పారిశ్రామికవాడలోని దాదాపు 20కు పైగా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలుంటే అవన్నీ ఒకదానికి ఒకటి అనుబంధంగా పనిచేసేవే.
నిర్మాణ రంగం ప్రభావం
ముడి సరకు, మార్కెట్ లేమి ప్రధాన సమస్యగా మారాయి. నిర్మాణ రంగానికి అనుబంధంగా పనిచేసే పరిశ్రమలు కొవిడ్‌కు ముందు నుంచే డీలా పడ్డాయి. ఇసుక, ఇతరత్రా సమస్యలతో నిర్మాణరంగం ఆశాజనకంగా లేకపోవటంతో వీటికి అనుబంధంగా నడిచే పరిశ్రమలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కరోనా ప్రభావంతో 3 నెలలుగా ఈ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌కి ముందు ఆర్డర్లపై ప్రభావం పడితే సడలింపులు వచ్చాక కార్మికుల కొరత, రవాణా, అనుబంధ పరిశ్రమలపై పెరిగిన సిమెంట్ ధరలు, ఇతర ఖర్చులు ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావట్లేదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలకు అనుగుణంగా బ్యాంకర్ల నుంచి సరైన సహకారం లేదని చెప్తున్నారు.