ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీల పన్నులపై కరోనా ప్రభావం...వసూళ్లు సగమే! - పంచాయతీల పన్నులపై కరోనా ప్రభావం...వసూళ్లు సగమే

కరోనా కారణంగా అనేక రంగాలు కోలుకోని స్థితికి వెళ్లిపోయాయి. పంచాయతీల పన్నులు వసూళ్లపై కూడా ఆ ప్రభావం చూపింది. 2018-19 సంవత్సరంతో పోల్చితే 2019-20లో వసూళ్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంపై పంచాయతీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం పన్నులతో పాటు పాత బకాయిలు కూడా వసూలు చేయాలని కృష్ణా జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.

పన్నుల వసూళ్ల వివరాలు
పన్నుల వసూళ్ల వివరాలు

By

Published : Jun 27, 2020, 6:24 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక పంచాయతీలు సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక సంఘ నిధులు విడుదల అయినా వాటిని ప్రభుత్వం నిర్ధేశించిన కొన్ని పనులకు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. పంచాయతీలకు ఆదాయ వనరు అయిన పన్నులు, బకాయిలు వసూలు కాకపోవడంతో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రభావం చూపుతోందని అధికారులు వాపోతున్నారు.

సగం వసూళ్లు మాత్రమే..

జిల్లాల్లో డివిజన్‌ల వారీగా చూస్తే 2019-20లో గుడివాడ డివిజన్‌ పన్నుల వసూళ్లలో ముందంజలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో మచిలీపట్నం నిలిచింది. జిల్లా వ్యాప్తంగా రూ.128 కోట్లకు పైగా వసూళ్లు కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.68 కోట్లపైగా అంటే సగం మాత్రమే వసూళ్లు సాధించారు. చాలా గ్రామాల్లో పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇటీవల ఎల్‌ఈడీ బల్బుల బకాయిలు చెల్లించాల్సి రావడంతో వాటికి కూడా ఆర్థిక సంఘ నిధులనే వినియోగించుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంఘ నిధులు పంచాయతీలను కొంతమేరకు ఆదుకున్నా, పన్నులు నూరుశాతం వసూళ్లు సాధిస్తేనే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది. అందుకే ఆ దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు.

అందరి భాగస్వామ్యంతో వసూళ్లు

లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలు సిబ్బంది వసూళ్ల ప్రక్రియను పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యదర్శులు, సిబ్బందికి ఇతర విధులు కూడా ఉండటంతో కొంత జాప్యం జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని పన్నుల వసూళ్లలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ కార్యదర్శితోపాటు వాలంటీర్లను కూడా భాగస్వామ్యం చేశారు. గతేడాది ఆన్‌లైన్‌ ద్వారా బిల్లులు అందజేశారు.

ఈసారి సంబంధిత వెబ్‌సైట్‌ అప్‌డేట్‌ కాని కారణంగా మాన్యువల్‌గా కూడా వసూళ్లు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఇంటింటికీ చెత్తసేకరణ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ నిధుల అవసరం ఉంది. పంచాయతీ పాలన భారంగా మారడంతో కార్యదర్శులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ప్రజలను చైతన్యం చేసి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

లక్ష్యం సాధించేలా చర్యలు

"పన్నుల వసూళ్లు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఎప్పటి మాదిరిగానే పాత బకాయిలతో పాటు ప్రస్తుతం కట్టాల్సిన పన్నులను కూడా వసూళ్లు చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వసూళ్లు చేస్తున్నాం. పన్నుల వసూళ్లలో జిల్లా ముందు వరసలోనే ఉంది. ప్రజలు కూడా ఎప్పటి పన్నులు అప్పుడు సకాలంలో చెల్లించి సహకరించాలని కోరుతున్నాం."

- పి.సాయిబాబు, జిల్లా పంచాయతీ అధికారి

పన్నుల వసూళ్ల వివరాలు

ABOUT THE AUTHOR

...view details