కరోనా కాలంలో మృతి చెందితే.. నా అన్నవాళ్లు దగ్గరకు రావడం లేదు.. చుట్టుపక్కల వాళ్లు ఇంటివైపు చూడటం లేదు.. సరిగ్గా నెల రోజుల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జ్వరంతో ఓ వృద్ధుడు మృతి చెందితే.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పంచాయతీ సిబ్బందే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అదే గ్రామంలో మరో సంఘటన జరిగింది.
పెనుగంచిప్రోలు పంచాయతీ కార్యాలయం రోడ్డులో నోముల నాగేశ్వరరావు (38) అతని తల్లి నోముల వెంకటరత్నం (70) నివాసం ఉంటున్నారు. అవివాహితుడైన నాగేశ్వరరావు తాపీ పని చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. పనులు ముగించుకొని గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా శివపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శుక్రవారం ఆటోలో ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో హఠాత్తుగా మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన విషయాన్ని తల్లి బంధువులకు తెలియజేసింది. భయంతో ఎవరూ రాలేదు. స్థానికులు దూరం నుంచే చూసి వెళ్లిపోయారు.