కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 278 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబంలో ఇద్దరేసి చొప్పున ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబాల్లో కొన్నింటి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం వారిని ఆదుకునే వాళ్లు కూడా లేక.. ఎలా బతకాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం కొన్ని కుటుంబాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. కొందరికి ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉన్నా ఇంటిని నడిపించే ప్రధాన ఆధారంగా ఉన్న మగవాళ్లు ఇద్దరేసి చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. అసలు.. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఊహ సైతం లేకపోవడంతో ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనల నుంచి వారు కోలుకోలేకపోతున్నారు.
- వైద్యుడైన కొడుకు, తండ్రి..
విజయవాడలోని భవానీపురానికి చెందిన మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేసే దేవరశెట్టి చెంచయ్య కరోనా వైరస్ బారినపడి చనిపోయారు. రెండు రోజుల తర్వాత వైద్యుడైన ఆయన కుమారుడు లక్ష్మణ్ కూడా చనిపోయారు. ఇతను ఎంబీబీఎస్ పూర్తి చేసి.. పీజీ వైద్య విద్య కోసం కాకినాడ రంగరాయ కళాశాలలో సీటు కూడా సాధించారు. అర్ధంతరంగా వైరస్ బారినపడి చనిపోయారు. ఈ బాధ నుంచి ఇప్పటికీ వారి కుటుంబం కోలుకోలేకపోతోంది.
- తల్లి, కొడుకు చనిపోవడంతో..