తెలంగాణ హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. గ్రేటర్‌లో బుధవారం 843 మందికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డిలో 132, మేడ్చల్ జిల్లాలో 96 కరోనా కేసులు నమోదయ్యాయి. గాంధీతోపాటు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 9 మంది కన్నుమూశారు.
కొన్ని ఇళ్లలో కుటుంబ సభ్యులంతా వైరస్ బారిన పడుతున్నారు. ఎవరికైనా ఆరోగ్యం విషమించి మృతిచెందితే కడచూపు దక్కడం లేదు. స్నేహితులు, బంధువులు కూడా దూరంగా ఉంటున్నారు.
మరీ తప్పదు అనుకుంటే...దూరం నుంచి చూసి వస్తున్నారు. కుటుంబ సభ్యులూ కరోనాతో ఆసుపత్రిలో లేదంటే ఇంట్లో ఉంటే వేరే దారి లేక సిబ్బందే ఈ తంతు పూర్తి చేస్తున్నారు.
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు...
వైరస్ సోకిన వెంటనే చాలామందిలో శ్వాసపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తొలుత వారం, పది రోజుల వరకు స్వల్ప లక్షణాలు ఉన్నా...కొన్నిసార్లు ఊపిరి కష్టమవుతోందని, ఛాతీ పట్టేసినట్లు ఉంటోందని అంటున్నారు.