కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి అదుపులోకి వస్తుందనుకునే తరుణంలో ఒక్క రోజే 545 కొత్త కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. ఈ కేసులన్నీ నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉండడంతో జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్.. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
గతంలో ఒక్క రోజులో అత్యధికంగా 470 కేసులు నమోదు కాగా.. గడచిన 24 గంటల్లో 545 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ముసునూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, ఉంగుటూరు మండలాల్లో ఒక్క రోజులోనే వంద కేసులు నమోదయ్యాయి. బుధవారం 5,516 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 545 మందికి కరోనా నిర్ధరణ అయింది. ముసునూరు మండలం రమణక్కపేటలో 40 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని గంపలగూడెం మండలంలో ఒకేసారి 21 మంది కరోనా బారినపడ్డారు.