కరోనాతో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరిని రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ అదే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరినీ పాస్ చేసింది. అయితే దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న వారి విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలోని కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి 71,210 మంది, ఇంటర్మీడియట్ 97,507 మంది చదువుతున్నారు. వచ్చేనెల 18 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించేలా ఇటీవలే షెడ్యూలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,68,717 మందిని పాస్ చేస్తారా.. పరీక్ష రాయిస్తారా అనే ఉత్కంఠ ఉంది.