కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటి లంక గ్రామమైన శృంగవరప్పాడులో పంచాయతీ సర్పంచి అభ్యర్థి ఏకగ్రీవంపై వివాదం నెలకొని, వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. శృంగవరప్పాడు సర్పంచి బీసీ మహిళకు రిజర్వు కాగా అభ్యర్థి ఎంపికపై శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ స్థానానికి ఘంటసాల జగన్నాథం భార్య భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచి ఘంటసాల ఆంజనేయులు భార్య సీత పోటీపడ్డారు. గతేడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఘంటసాల భాగ్యలక్ష్మిని సర్పంచి అభ్యర్థిగా ఎమ్మెల్యే ప్రకటించారు. కరోనా కారణంగా నిలిచిపోయి ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థి ఎంపిక చర్చనీయాంశమైంది. భాగ్యలక్ష్మిని సర్పంచి అభ్యర్థిగా ఏకగ్రీవం చేయాలని జగన్నాథం వర్గం పట్టుబడుతుండగా.. అదే పార్టీకి చెందిన ఆంజనేయులు వర్గం వ్యతిరేకిస్తు తాము పోటీ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో గ్రామంలో సమావేశం నిర్వహించారు. దీంతో మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకోగా.. ఆంజనేయులు వర్గానికి చెందిన ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.
శృంగవరప్పాడు సర్పంచి అభ్యర్థి ఏకగ్రీవంపై వివాదం.. ఎనిమిది మందికి గాయాలు - kaikaluru latest news
కృష్ణా జిల్లా కైకలూరు మండలం శృంగవరప్పాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికపై.. వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఓ వర్గం వారికి చెందిన 8మంది గాయపడగా.. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

శృంగవరప్పాడు సర్పంచి అభ్యర్థి ఏకగ్రీవంపై వివాదం.. ఎనిమిది మందికి గాయాలు
TAGGED:
anchayat elections