Conditions of crop canals in irrigation Krishna district: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే విజయవాడలోని... ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వలు మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ సరిగాలేక గుర్రపు డెక్క, తూటుకాడతో.. కాల్వలు నిండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు ప్రభుత్వం నీరు విడుదల చేసినా... చివరి ఎకరాకు అందుతుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఖరీఫ్ సీజన్‌కు ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నేడు ప్రకాశం బ్యారేజీనుంచి సాగునీటిని విడుదల చేస్తున్నట్టు మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఐతే పంట కాల్వల దుస్థితి అధ్వానంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల నుంచి కాల్వల నిర్వహణ లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలలో వ్యర్థాలు పేరుకుపోవటంతో వర్షాలు పడినప్పుడు నీరు పొలాల్లోకి వస్తోందని... అడపా దడపా గుర్రపు డెక్కపై రసాయనాలు స్ప్రే చేసినా... ఫలితం దక్కటంలేదని రైతులు అంటున్నారు.
వరద కష్టం... పంటలు నీటిపాలు!
గత సంవత్సరం సాగునీటి విడుదలపై హడావుడి చేసిన ప్రభుత్వం ఈ ఏడాడి వరి నారు మళ్లకు, నాటుకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో ఇంత వరకు వెల్లడించలేదు. కృష్ణ డెల్టాలో ఎక్కవ శాతం కాల్వలపై ఆదారపడి రైతులు సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మాత్రం బోర్ల ద్వారా సాగు జరుగుతుంటుంది. విజయవాడలో కృష్ణనది నుంచి మూడు కాల్వాల ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందుతోంది. జిల్లాలో ఉన్న కాలువల అధునీకీకరణకు 2011లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రూ. 4573 కోట్ల రుపాయలతో శ్రీకారం చూట్టారని రైతు సంఘాల నేతలు తెలిపారు. 2011లో రైవస్ కాలువ పరిష్టతకు ఒక వైపు గోడ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ రైవస్ కాలువ గోడను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.